

తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్‌క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ) ఐఎన్‌ఎస్ మంగ్రోల్ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డులో పశ్చిమ నౌకాదళ విభాగం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొచ్చిన్ షిప్‌యార్డులో నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. మాహె తరగతికి చెందిన యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్ మంగ్రోల్ మూడోది.
తీర ప్రాంతాల్లో భారీ యుద్ధనౌకల కదలికలు, కార్యకలాపాలు నిర్వహించడం కష్టమైన పరిస్థితుల్లో ఐఎన్‌ఎస్ మంగ్రోల్ కీలకంగా పనిచేయనుంది. ఈ యుద్ధనౌకలో తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్, మారీచ్ అడ్వాన్స్‌డ్ టార్పెడో డికాయ్ సిస్టమ్, అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థతో పాటు పలు ఆధునిక ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. వీటి సాయంతో తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, వాటి నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఈ నౌక చేరికతో భారత నౌకాదళం తీర ప్రాంత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!