

పేదలకు సొంత ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల పథకం.. పెద్ద దోర్నాలలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గ్రామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు. పెద్ద దోర్నాల, అయినముక్కుల, తిమ్మాపురం, అసానాబాద్, జమ్మిదోర్నాల, చిన్నదోర్నాల గ్రామాలకు చెందిన 410 మంది లబ్ధిదారులకు పదెకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం కింద నేల చదును, రహదారుల నిర్మాణానికి రూ.కోటికి పైగా వెచ్చించగా.. విద్యుత్తు, నీటి వసతి తదితర పనుల కోసం మరో రూ.కోటి ఖర్చు చేశారు. ఐదు బోర్లు వేసి చిన్న నీటి ట్యాంకులను కూడా నిర్మించారు.
అయితే, జనావాసాలకు దూరంగా ఉండటంతో పాటు నివాసానికి అనువుగా లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఒక్క ఇల్లు మాత్రమే పూర్తిస్థాయిలో శ్లాబు వేయగా.. మరో ఐదు ఇళ్లు శ్లాబు దశలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం కాలనీ మొత్తం చిల్లచెట్లు పెరిగి చిట్టడవిలా మారింది. బోర్ల మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లగా.. విద్యుత్తు పరివర్తకాలు కూడా కనిపించడం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నా, ఇప్పటికే వారి పేర్లపై స్థలాలు ఆన్‌లైన్‌లో నమోదైనందున మరోచోట కేటాయించడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని గృహనిర్మాణ శాఖ డీఈ సురేష్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!