

భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఓ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కార్యక్రమాన్ని నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేదికపై విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన కపిల్ దేవ్.. పాఠశాలలో సరైన వ్యవస్థ, క్రమశిక్షణ ఉండాలని సూచించారు. కార్యక్రమం నిర్ణయించిన సమయానికి ప్రారంభం కాకపోవడంతో తాను చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనను కేవలం ఫొటోల కోసం మాత్రమే కార్యక్రమానికి పిలిచారా? అని కపిల్ దేవ్ ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ముందుగానే విషయం చెబితే అందుకు అనుగుణంగా ప్రత్యేక సమయం కేటాయించేవాడినని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో కనీస సదుపాయాలు కూడా సరిగా లేవని, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించలేదని ఆయన ఆక్షేపించారు. పాఠశాల కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో జరగాలని సూచించిన కపిల్ దేవ్.. ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వాలని విద్యార్థులకు హితవు పలికారు. ఆయన సూటిగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!