

జింబాబ్వేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, ఆయన భార్య లూసీ ముటేకేతో పాటు మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రాజధాని హరారేకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని మారోండేరా గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గందామిలోని తమ గ్రామీణ ఇంటిని సందర్శించి తిరిగి వస్తుండగా కుదెంకా ఫామ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
43 ఏళ్ల చివాయో ఇంట్రాట్రెక్ జింబాబ్వే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం, సోషల్ మీడియాలో తన సంపదను ప్రదర్శించడం వంటి కారణాలతో ఆయన తరచూ వార్తల్లో నిలిచేవారు. పలు ఆఫ్రికా దేశాల రాజకీయ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంట్రాట్రెక్ జింబాబ్వే ద్వారా గ్వాండాలో సౌర విద్యుత్ ప్రాజెక్టుతో సహా పలు ఇంధన రంగ ప్రాజెక్టుల్లో ఆయన సంస్థ భాగస్వామ్యమైంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, రాజకీయ సంబంధాలపై ఆయనపై గతంలో విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ.. చివాయో వాటిని ఖండించారు. ఆయన మృతిపై రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి సంతాపాలు వ్యక్తమవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!