

ప్రపంచ సగటు ఆయుర్దాయం కరోనా మహమ్మారికి ముందు స్థాయికి దాదాపు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్‌లో వెల్లడించింది. 2019లో 73.4 ఏళ్లుగా ఉన్న ప్రపంచ సగటు ఆయుర్దాయం 2021లో కరోనా ప్రభావంతో 71.5 ఏళ్లకు పడిపోయింది. అయితే 2023 నాటికి 73.3 ఏళ్లకు చేరుకుంది. మరోవైపు, ఆరోగ్యంగా జీవించే సగటు కాలం మాత్రం నెమ్మదిగా కోలుకుంటోంది. 2023లో హెల్తీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 62.8 ఏళ్లుగా నమోదైంది. ఇది 2019 స్థాయి కంటే 0.4 ఏళ్లు తక్కువ.
WHO అంచనాల ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.1 కోట్ల మంది మరణించారు. వీరిలో 3.3 కోట్ల మరణాలకు 10 ప్రధాన కారణాలు కారణమయ్యాయి. అత్యధిక మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (IHD) ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల సుమారు 95 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల్లో ఇది 16 శాతం. ఆ తర్వాత స్ట్రోక్ కారణంగా సుమారు 68 లక్షలు, క్రానిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) కారణంగా 36 లక్షల మంది మరణించారు. లోయర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, అల్జీమర్స్ మరియు ఇతర డిమెన్షియా వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, అధిక రక్తపోటు సంబంధిత గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులు కూడా ప్రధాన మరణ కారణాల జాబితాలో ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!