

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. కేసుకు సంబంధించి ముందుగా నిర్ణయించిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనపై ఒత్తిడి తెచ్చారని, వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారని ఆరోపించారు. గిరీష్ మట్టన్నవర ద్వారా ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడి, జూన్ 29న కలుస్తానని చెప్పినట్లు చిన్నయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే ధర్మస్థల అంశంపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని, సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు చిన్నయ్య తెలిపారు. ఈ కుట్రలో మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర, విఠల్ గౌడ, జయంత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటిషన్‌ను స్వీకరించి కేసు వివరాలు కోరింది. తదుపరి విచారణను జూన్ 29కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, తన పేరు ప్రస్తావనపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, రెండు రోజుల్లో స్వయంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!