

కరూర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ మృతులకు నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం తమ జీవితాల్లో ఎప్పటికీ మానని గాయంగా మిగిలిపోయిందని విజయ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు, తన మద్దతుదారులు, టీవీకే కుటుంబం ఈ విషాదాన్ని ఇప్పటికీ మరవలేకపోతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను మాటల్లో చెప్పలేమని, ఒకరికొకరం అండగా నిలుద్దామని ఆయన పిలుపునిచ్చారు.
కరూర్ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును పరిశీలించగా.. అనంతరం నిష్పక్షపాత దర్యాప్తు అవసరమంటూ సుప్రీంకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. సభకు అనుమతులు, జనసమూహ నియంత్రణ, ఏర్పాట్లు, ఘటనకు దారితీసిన పరిస్థితులు తదితర అంశాలను దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఈ కేసులో టీవీకేకు చెందిన పలువురు నేతలను సీబీఐ విచారించగా, విజయ్‌ను కూడా పలుమార్లు ప్రశ్నించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!