

శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను బుధవారం ఉదయం 8:30 గంటలకు మూసివేశారు. అంతకుముందు ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భాలయంతో పాటు దక్షిణ ద్వారాన్ని మూసివేశారు. అనంతరం కేదార్‌నాథుడి పంచముఖి ప్రతిమను సంప్రదాయ పంచముఖి డోలీలో తూర్పు ద్వారం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం కేదార్‌నాథుడి ప్రతిమను పంచముఖి డోలీలో ఉఖీమఠ్‌కు తరలించనున్నారు. అక్కడ వచ్చే ఆరు నెలల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్య ఆరాధనలు నిర్వహిస్తారు. శీతాకాలంలో భారీగా మంచు కురవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకోవడం కష్టమవుతుంది. అందుకే ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభంలో ఆలయ ద్వారాలను మూసివేసి, స్వామివారి ప్రతిమను ఉఖీమఠ్‌కు తరలించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఆలయం తిరిగి తెరిచే వరకు భక్తులు ఉఖీమఠ్‌లోనే స్వామివారిని దర్శించుకోవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!