

కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారని, తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలను పార్టీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రకు బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తోందని విమర్శించారు. ప్రతి గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలని నాయకులకు సూచించారు. ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకుని, ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!