

ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు ప్యూర్టోరికోలో జరుగుతున్నాయి. నవంబర్ 24న తుది పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 121 దేశాలకు చెందిన అందాల భామలు ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. ఈ పోటీల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. దీనికి ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ అని పేరు పెట్టారు. ప్రముఖ జ్యుయెలరీ డిజైనర్ జార్జ్ విటెల్స్, పారిస్‌కు చెందిన మైసన్ డిఓర్ సంస్థ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు.
ఈ కిరీటంలోని మూడు ప్రధాన వజ్రాలకు ప్రత్యేకమైన ప్రతీకాత్మకత ఉంది. ఎడమవైపు ఉన్న వజ్రం గతంలో మహిళలు సాధించిన విజయాలను సూచిస్తుండగా.. కుడివైపు ఉన్నది స్ఫూర్తినిస్తున్న మహిళలకు ప్రతీకగా నిలుస్తోంది. మధ్యలోని వజ్రం భవిష్యత్తు తరాల మహిళల ఆశయాలను సూచిస్తుంది. 75వ వార్షికోత్సవానికి గుర్తుగా కిరీటంలో 75 అనే సంఖ్యను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. మిస్ యూనివర్స్ చరిత్రలో ఇప్పటివరకు 12 అధికారిక కిరీటాలు రూపుదిద్దుకున్నాయి. తాజాగా ఆవిష్కరించిన కిరీటాన్ని మహిళల శక్తి, విజయాలు, వారసత్వానికి ప్రతీకగా నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!