

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’తో సాత్విక వీరవల్లి వెండితెరకు పరిచయమవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 20న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన సాత్విక.. తన పాత్ర, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో కల్పన అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లాలనే కల కల్పనది కాగా, దుల్కర్ పోషించిన కృష్ణ పాత్ర ఆమె లక్ష్య సాధనకు ఎలా అండగా నిలుస్తుందనేది కథలో ఆసక్తికర అంశమని చెప్పారు. ఒక అమ్మాయి విజయం వెనుక గొప్ప మనసున్న అబ్బాయి ఉండే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
కల్పన పాత్ర తన నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుందని సాత్విక తెలిపారు. అమాయకంగా, ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడూ అంతరిక్షం గురించే ఆలోచించే అమ్మాయిగా కనిపిస్తానని చెప్పారు. దర్శకుడు పాత్ర గురించి వివరించినప్పుడు తన బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, వాటిని నటనకు ఉపయోగించుకున్నానని వెల్లడించారు. అమెరికాలో పుట్టి పెరిగిన తనకు పల్లెటూరి అమ్మాయి పాత్రలోకి మారడం సవాలుగా అనిపించిందన్నారు. తన తండ్రి మాధవ్ తెలుగువారని, తల్లి కోల్‌కతాకు చెందినవారని తెలిపిన ఆమె.. మాస్టర్స్ పూర్తయ్యాక రెండేళ్లపాటు ఐటీ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేసినట్లు చెప్పారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చానన్నారు. తొలుత ఒక్క సినిమా చేసి అమెరికాకు తిరిగి వెళ్లాలని భావించినప్పటికీ, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఆ ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!