

తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న తిరునారైయూర్ క్షేత్రాన్నే నాచ్చియార్ కోవెల్ అని పిలుస్తారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా పేరుపొందిన ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని కాలగరుడన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవ ఊరేగింపుల సమయంలో గరుడుడి రాతి విగ్రహం క్రమంగా బరువు పెరుగుతుందని, దానిపై చెమట బిందువుల్లా తేమ కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయంలో జరిగే ఉత్సవాల్లో అమ్మవారు హంస వాహనంపై ముందుగా ఊరేగింపుగా వెళ్తారు. ఆమె వెనుక శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై బయలుదేరుతారు. అమ్మవారిని దాటి ముందుకు వెళ్లకూడదని గరుత్మంతుడు స్వామివారికి మాట ఇచ్చినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ క్రమంలో ఆలయంలోని ఐదు ప్రాకారాలను దాటే కొద్దీ గరుడ వాహనం బరువు పెరుగుతుందని, మొదట నలుగురు మోసే విగ్రహాన్ని రెండో ప్రాకారం వద్ద ఎనిమిది మంది, ఆ తర్వాత 16, 32, 64 మంది మోయాల్సి వస్తుందని చెబుతారు. ఆలయం వెలుపల ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి సుమారు 120 మంది అవసరమవుతారని సంప్రదాయ కథనం. ఊరేగింపు సమయంలో విగ్రహంపై చెమట బిందువుల్లా తేమ కనిపించడం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకతగా భక్తులు భావిస్తారు. ఈ విశేషాలే నాచ్చియార్ కోవెల్ కాలగరుడన్ ఉత్సవానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!