

సాల్మన్ చేపలను సముద్రపు పేన్ల (సీలైస్) బారి నుంచి కాపాడేందుకు నార్వే వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వేల సంఖ్యలో అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించింది. నార్వేలో సాల్మన్ చేపల పెంపకానికి సీలైస్ సమస్య తీవ్ర సవాలుగా మారింది. గతంలో ఈ పరాన్నజీవులను తొలగించేందుకు చేపలను రసాయనాలతో శుభ్రం చేసేవారు. అయితే ఆ రసాయనాల అవశేషాలు చేపలను తినే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, కాలక్రమేణా సీలైస్ రసాయనాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో ఓస్లో కేంద్రంగా పనిచేసే స్టింగరే మెరైన్ సొల్యూషన్స్ సంస్థ సుమారు 3,500 ప్రత్యేకమైన నీటి అడుగున పనిచేసే రోబోలను వినియోగిస్తోంది. గతేడాది మరో 1,000 రోబోలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి సాల్మన్ చేపల శరీరాలపై, పరిసరాల్లోని సీలైస్‌ను గుర్తించి లేజర్ల సాయంతో నిర్మూలిస్తాయి. ఈ ప్రక్రియలో చేపలకు హాని కలగకుండా సాంకేతికతను రూపొందించారు. ఈ రోబోలు నార్వేలోని చేపల ఫామ్‌లలో సుమారు 11.2 కోట్ల సాల్మన్ చేపలకు రక్షణ కల్పిస్తూ, దేశంలోని దాదాపు 25 శాతం సాల్మన్ చేపలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు చేపల కదలికలు, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించేందుకు రైతులు 15 వేల కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!