

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) స్వదేశంలో ఇళ్లు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పెట్టుబడి, ఆస్తి విలువ పెరుగుదలే ప్రధాన లక్ష్యాలుగా ఉండగా.. ఇప్పుడు అద్దె ఆదాయం, మెరుగైన నిర్మాణ నాణ్యత, రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు వంటి అంశాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన నివాసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణే, హైదరాబాద్ నగరాలు ఎన్‌ఆర్‌ఐల దృష్టిని ఆకర్షిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అంతర్జాతీయ విమాన సదుపాయాలు, విస్తరిస్తున్న మౌలిక వసతులు, వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న నివాస గృహాలు ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షిస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో సంప్రదాయ ఖరీదైన ప్రాంతాలకు బయట కూడా కొనుగోలు అవకాశాలు పెరుగుతున్నాయి.
ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, ఉత్తర బెంగళూరు ప్రాంతాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఉండటం కూడా పెట్టుబడిదారులకు కలిసొస్తోంది.ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో ప్రీమియం నివాస ప్రాజెక్టులు, కార్పొరేట్ సంస్థలు, మెరుగుపడుతున్న రవాణా సదుపాయాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు అక్కడ ఇల్లు కొనడం మరో ప్రయోజనంగా మారుతోంది.
ఐటీ, వైద్య రంగాల అభివృద్ధి, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ కూడా ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యంగా నగర పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమైన నివాస ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. ఉద్యోగ కేంద్రాలకు సులభంగా చేరుకునే అవకాశం, రవాణా సదుపాయాలు కొనుగోలు నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు తల్లిదండ్రుల భవిష్యత్తు అవసరాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వైద్య సేవలకు చేరువగా ఉండటం, సామాజిక సంబంధాలు, బహిరంగ ప్రదేశాలు, అవసరమైనప్పుడు సహాయం అందే సదుపాయాలు కూడా ముఖ్యమని వివరించారు. దీంతో స్వదేశంలో స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు కేవలం పెట్టుబడికే పరిమితం కాకుండా కుటుంబ అవసరాలతోనూ ముడిపడుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!