

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లకు అధికారిక విధుల నిర్వహణ సమయంలో చేసిన చర్యలు, వ్యాఖ్యలకు చట్టపరమైన రక్షణ కల్పించే 2023 నాటి చట్టంలోని సెక్షన్ 16ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ అరుణ్ కుమార్ అగర్వాల్ ఈ నిబంధన రాజ్యాంగబద్ధతను ప్రశ్నించారు. ఈ రక్షణ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వర్తిస్తుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల జాబితా నుంచి ఓటరు పేరు తప్పుగా తొలగించినా, అభ్యర్థికి అన్యాయం జరిగినా లేదా ఎన్నికల సంఘంలో అవినీతి ఆరోపణలు వచ్చినా బాధితులకు న్యాయపరమైన పరిష్కారం లభించకుండా ఈ నిబంధన అడ్డుపడే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. తొలుత 2023 బిల్లులో ఈ తరహా రక్షణ నిబంధన లేదని, ఆ తర్వాత సవరణ ద్వారా సెక్షన్ 16ను చేర్చారని పేర్కొన్నారు. ఈ మార్పుకు తగిన కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదని అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు పెద్ద సంఖ్యలో సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో ఈ నిబంధనతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానాల తర్వాత ఈ అంశంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!