

మురసు తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు.
ఇక బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 182.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లిలో 139.63 మి.మీ, పి.నారాయణపురంలో 128.75 మి.మీ, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 126.25 మి.మీ వర్షం కురిసింది. పెదపూడి, నూతిరామన్నపాలెం, కాజులూరు, కరప, వేళంగి, జి.మామిడాడ ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, నీట మునిగిన కాజ్‌వేలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. వాతావరణ, వరద హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!