

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో ఈ ఏడాది జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) ఆచూకీ కోసం పోలీసులు మరోసారి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు పురోగతిని సమీక్షించి, తదుపరి దర్యాప్తు, చర్యలను చేపట్టేందుకు ఈ బృందాన్ని నియమించారు. చిన్నారి అదృశ్యమై దాదాపు 160 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు సుంకర గణేష్, భవాని ఆశగా ఎదురుచూస్తున్నారు.
చిన్నారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ సిబ్బంది, హనుమాన్ బృందాలు కొండ ప్రాంతాలు, తోటల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు వందలాది ఫోన్ కాల్స్‌ను విశ్లేషించారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి కూడా ప్రకటించారు. చిన్నారి వెంట వెళ్లి కనిపించకుండా పోయిన పెంపుడు శునకం జూన్ 13న అనారోగ్యంతో మృతి చెందింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు చెందిన ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రెండు రోజులుగా చిన్నారి అదృశ్యమైన ఆయిల్‌పామ్ తోటతో పాటు సమీపంలోని కొండ ప్రాంతాల్లో జాగిలాల సహాయంతో గాలిస్తోంది. మెటల్ డిటెక్టర్లతోనూ ఆయా ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!