

ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న ఏకైక నిజమైన సంపద అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులో కేసు ఓడిపోయిన వ్యక్తి కూడా.. తనతో న్యాయవ్యవస్థ న్యాయంగా వ్యవహరించిందనే నమ్మకంతో ఉండాలని పేర్కొన్నారు. తాను ఆశించిన తీర్పు రాలేదన్న కారణంతో న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే విచారణ సమయంలో తమతో అన్యాయంగా వ్యవహరించారని ప్రజలు భావిస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని చెప్పారు. దిల్లీలో జరిగిన 6వ రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ‘న్యాయం జరిగినట్లు కనిపించడం: న్యాయ వ్యవస్థకు పారదర్శకత, ప్రజా విశ్వాసం మూలస్తంభాలు’ అనే అంశంపై సీజేఐ ప్రసంగించారు.
న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమైన సంస్థ కాదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ పనితీరుపై నిష్పక్షపాతమైన, సమాచారంతో కూడిన, నిర్మాణాత్మక విమర్శలు చైతన్యవంతమైన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన, అవసరమైన అంశాలని పేర్కొన్నారు. ఇలాంటి విమర్శలు సంస్థాగత జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు స్వీయ దిద్దుబాటుకు దోహదపడతాయని చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకానికి సంబంధించిన సుమోటో విచారణను ప్రస్తావిస్తూ.. న్యాయవ్యవస్థ తనను తాను పరిశీలన, ప్రశ్నలు, అవసరమైన విమర్శలకు తెరిచి ఉంచుకోవాలని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!