

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల ఎస్సైలు (ప్రస్తుతం డీఎస్పీలు)కు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మూడు బ్యాచ్‌లకు చెందిన పలువురు అధికారులతో డీజీపీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 37 అదనపు ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, సీనియారిటీ జాబితాపై పలువురు అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ సమావేశం నిర్వహించారు.
శాంతిభద్రతల విభాగం డీజీ మహేశ్ భగవత్, మల్టీజోన్-1, 2 ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసిం సమావేశంలో పాల్గొన్నారు. అందరూ సహకరిస్తే త్వరగా పదోన్నతులు కల్పించవచ్చని డీజీపీ తెలిపారు. 37 మంది డీఎస్పీలకు వెంటనే పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం వరంగల్ జోన్, హైదరాబాద్ సిటీకి చెందిన మూడు బ్యాచ్‌ల అధికారులు కేసుల ఉపసంహరణకు సుముఖత వ్యక్తం చేసినట్లు డీజీపీ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. దీంతో పదోన్నతుల వ్యవహారం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!