

ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో 75వ మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. గత ఏడాది విజేతగా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్-12కు చేరుకోలేకపోయారు. ఫైనల్ రౌండ్‌లో ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలని అడిగిన ప్రశ్నకు జెన్నిఫర్ సమాధానమిస్తూ.. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సహానుభూతి కలిగిన నాయకులు అవసరమని పేర్కొన్నారు. ఇతరులను విమర్శించే బదులు వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలని, తమ విలువలకు కట్టుబడి ఆదర్శంగా నిలవాలని చెప్పి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు.
మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కిరీటాన్ని రూపొందించారు. ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు. జెన్నిఫర్ విజయంతో ప్యూర్టోరికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది. గతంలో 1970, 1985, 1993, 2001, 2006 సంవత్సరాల్లో ఆ దేశానికి చెందిన అందాల భామలు ఈ ఘనత సాధించారు. ఇక 2027లో జరగనున్న 76వ మిస్ యూనివర్స్ పోటీలకు వియత్నాం ఆతిథ్యం ఇవ్వనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!