

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కుడి కాలును తొలగించారు. మోకాలి పైభాగం వరకు కాలును తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఎడమ కాలిలోని రక్తనాళాలు కూడా దెబ్బతినడంతో ఆ కాలికి సైతం శస్త్రచికిత్స చేసినట్లు వివరించారు. ప్రస్తుతం హేమంత్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీ విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మల్లీశ్వరి పేర్కొన్నారు.
పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఆత్మకూరు అడవిలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సీఐ వెంకటేశ్‌పై నిందితుడు దాడికి యత్నించడంతో పోలీసులు తొలుత గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు ప్రతిఘటించడంతో కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుడి కాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో కణజాలం దెబ్బతిని పరిస్థితి విషమించిందని, అందుకే వైద్యులు ఆ కాలును తొలగించాల్సి వచ్చిందని సమాచారం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!