

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు వివిధ కీలక పదవుల కోసం పోటీ పడుతున్నారు. గవర్నర్, సెనేటర్, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమెరికాలో సుమారు 52 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాతినిధ్యానికి 1956లోనే పునాది పడింది. ఆ ఏడాది దిలీప్ సింగ్ సౌంద్ అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఆసియా అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. ఈసారి ఒహాయో గవర్నర్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్‌తో ఆయన తలపడుతున్నారు. గెలిస్తే అమెరికాలో భారత సంతతికి చెందిన మూడో గవర్నర్‌గా నిలుస్తారు. హైదరాబాద్‌లో జన్మించిన అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో ఉన్నారు. లాస్‌ఏంజెలెస్ మేయర్ పదవికి నిత్యా రామన్ పోటీ చేస్తున్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న రో ఖన్నా, అమీ బెరా, ప్రమీలా జయపాల్, సుహాస్ సుబ్రమణ్యం మరోసారి ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్నారు. వీరంతా డెమోక్రటిక్ పార్టీకి చెందినవారే. రో ఖన్నాపై భారత సంతతికి చెందిన రితేశ్ ఠాండన్ పోటీ చేస్తున్నారు. మరోవైపు ఫ్లోరిడాలో పియా దాండియా, ఆరిజోనాలో అమీష్ షా, నార్త్ కరోలినాలో మహేశ్ గనోర్కర్ వంటి వారు బరిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఆరిజోనాలో ప్రియా సుందరేశన్, మిషిగన్‌లో రంజీవ్ పురీ, న్యూయార్క్‌లో సరితా కోమటిరెడ్డి, లిసా కౌల్, విస్కాన్సిన్ అటార్నీ జనరల్ పదవికి జోష్ కౌల్ పోటీ చేస్తున్నారు. టెక్సాస్‌లో పూజా సేథీ, జార్జియాలో సుచితా పటేల్, వాషింగ్టన్ డీసీలో అపర్ణ రాజ్‌తో పాటు పలువురు భారత సంతతి అభ్యర్థులు వివిధ పదవుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాతినిధ్యంపై ప్రభావం చూపనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!