

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన కుడికాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో కణజాలం దెబ్బతిని కుళ్లిపోయింది. దీంతో వైద్యులు ఇటీవల ఆ కాలును తొలగించారు. అప్పటి నుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో హేమంత్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆయన తీవ్ర శ్వాస సంబంధిత ఇబ్బందికి గురై మంచంపై నుంచి కిందపడిపోయారు.
దీంతో వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా పల్మనరీ ఎంబాలిజం సమస్య బయటపడింది. ప్రస్తుతం దీనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం కూడా ఒకటని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తప్రసరణకు ఆటంకం కలగడమే కాకుండా గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!