

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడూ తటస్థంగానే వ్యవహరిస్తుందని, తగిన ఆధారాలు ఉంటేనే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేయాలంటే కలెక్టర్లు, ఎస్పీల నివేదికలతో పాటు సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. అనంతపురం, పల్నాడు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ప్రిసైడింగ్ ఆఫీసర్ల నివేదికలు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదివారం సాయంత్రం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఎక్కువగా ప్రశాంతంగానే జరిగిందని, కొన్ని జిల్లాల్లో స్వల్ప ఘర్షణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వివరించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 48.3 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
అన్నమయ్య జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పునేఠా తెలిపారు. మదనపల్లెలో వచ్చిన మూడు ఫిర్యాదులపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో మరో ఫిర్యాదుపై విచారణ జరపగా, సరైన ఆధారాలు లేవని అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. పులివెందులలో 70 పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్లు లేరన్న సమాచారంపై ఎస్పీతో మాట్లాడామని, ఏజెంట్ల వివరాలు అందిస్తే పోలీసు భద్రత కల్పిస్తామని ఫిర్యాదుదారులకు చెప్పినట్లు వివరించారు. విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పత్రాల్లో గుర్తుల తేడా కారణంగా సుమారు గంటన్నర పాటు పోలింగ్ నిలిచిపోవడంతో, కొత్త బ్యాలెట్ పత్రాలు ముద్రించి తిరిగి ప్రారంభించారని తెలిపారు. అక్కడ పోలింగ్ సమయాన్ని రాత్రి 7.30 గంటల వరకు పొడిగించారు. మరోవైపు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 107 మందిని అరెస్టు చేసినట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. ఆదివారం పోలింగ్ సందర్భంగా 40 ఘటనలు చోటుచేసుకున్నాయని, నేరాలు జరిగినట్లు తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!