

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే అభ్యర్థులకు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు రెండున్నర గంటల పాటు ప్రత్యేక వీడియో పాఠాన్ని తప్పనిసరిగా వీక్షించాలి. ఈ నిబంధనలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తొలుత భావించినప్పటికీ, పది రోజుల ముందుగానే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో యువత డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత మూడు నెలల్లో 14,329 మంది పురుషులు, 681 మంది మహిళలు లైసెన్స్‌లు పొందారు.
గతంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రవాణా శాఖ కార్యాలయంలో కంప్యూటర్ పరీక్ష రాయడం ద్వారా లెర్నింగ్ లైసెన్స్ పొందేవారు. నెల రోజుల తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, అధికారుల ఎదుట వాహనం నడిపి పరీక్షలో ఉత్తీర్ణులైతే లైసెన్స్ జారీ చేసేవారు. కొత్త విధానంలో లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో పాసైన అభ్యర్థుల మొబైల్‌కు ప్రత్యేక లింక్ వస్తుంది. అందులో లెర్నింగ్ లైసెన్స్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. అనంతరం ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో రెండున్నర గంటల వీడియో పాఠాన్ని పూర్తిగా చూడాలి. ఇందులో డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణకు సంబంధించిన అంశాలను వివరిస్తారు. వీడియో చూస్తున్నప్పుడు తలను పక్కకు తిప్పినా అది నిలిచిపోతుంది. మధ్యలో వీడియోను ఆపివేసినా లేదా పూర్తిచేయకపోయినా అభ్యర్థి అనర్హుడయ్యే అవకాశం ఉంది. వీడియో పూర్తయిన తర్వాత ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాని ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!