

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి. మోహన, జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ విక్రమ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలని, ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదని అన్నారు. బాలల ఆన్‌లైన్ భద్రతపై సదస్సులో చర్చించడం అభినందనీయమన్నారు.
పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నుంచి వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు, పోలీసులు, బాలల సంరక్షణ విభాగాలు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సీఎం అన్నారు. తెలంగాణలోని భరోసా కేంద్రాలు, బాలల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం, షీ-భరోసా సైబర్ ల్యాబ్‌లు, సైబర్ అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థతో కలిసి సమగ్ర బాలల ఆన్‌లైన్ భద్రతా విధానాన్ని రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు వారితో అవగాహనతో మాట్లాడాలని సూచించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంచార లోక్ అదాలత్ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఉచిత న్యాయ సేవలను మరింత చేరువ చేయడం, న్యాయ సహాయం అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. న్యాయ సేవా సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా, గ్రామానికి చేరేలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!