

అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా వాసులు, ముఖ్యంగా భారత, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంతతికి చెందిన వారిపై ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ నివేదిక వెల్లడించింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో దక్షిణాసియన్లను లక్ష్యంగా చేసుకున్న విద్వేషపూరిత పోస్టులు జనవరి 2024 నుంచి జూన్ 2026 మధ్య 240 శాతం పెరిగినట్లు తెలిపింది. నెలకు సగటున 12,904గా ఉన్న పోస్టుల సంఖ్య జూన్ 2026 నాటికి 43,843కు చేరింది. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు సుమారు 5.42 లక్షల పోస్టులను పరిశోధకులు గుర్తించారు.
వలస విధానాలపై చర్చలు, ఆర్థిక అసంతృప్తి, రాజకీయ వ్యాఖ్యలు, అమెరికా సమాజంలో దక్షిణాసియన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం వంటి అంశాలతో ఈ పెరుగుదలకు సంబంధం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియా వాసులు అమెరికన్ల ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆన్‌లైన్ పోస్టుల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయని తెలిపింది. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణం దక్షిణాసియా సమాజంపై ప్రభావం చూపడంతో పాటు అమెరికా సాంకేతిక రంగం, భారత్-అమెరికా ప్రజల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!