

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అక్వాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. గురువారం రాత్రి సమయానికి ఇది కళింగపట్నానికి 270 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 350 కిలోమీటర్లు, పూరీకి 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం గోపాల్‌పూర్ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన అనంతరం తుపాను బలహీనపడి సాధారణ తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఒడిశాలోనూ 20, 21 తేదీల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే గురువారం మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం కనిపించింది. శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అత్యధికంగా 55.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలాసలో 33.73, మందసలో 31, హరిపురంలో 29.5, టెక్కలి మండలం రావివలసలో 27.5 మి.మీ. వర్షం కురిసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!