

మురసు తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వేగంగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం.. నవంబర్ 2 ఉదయం 8.30 గంటల సమయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదిలింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, కావలికి ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున మధ్య నెల్లూరు-నర్సాపురం మధ్య, ఒంగోలుకు దక్షిణంగా దక్షిణ ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం అప్పుడప్పుడు 120 కిలోమీటర్లకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాపట్ల, కృష్ణా సహా తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని విపత్తు నిర్వహణ విభాగాలు సూచిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!