

హైదరాబాద్ మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం 44 పేజీల తీర్పు వెలువరించింది. 1912లో నిర్వహించిన సర్వేలో సర్వే నంబర్ 100లోని 277.05 ఎకరాలు, సర్వే నంబర్ 101లోని 273.34 ఎకరాలను ప్రభుత్వ పోరంబోకు భూములుగా గుర్తించినట్లు ధర్మాసనం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి, అధికారులతో కుమ్మక్కై విలువైన భూమిని కాజేయడానికి ప్రయత్నించారని తీవ్రంగా ఆక్షేపించింది. యాజమాన్య హక్కులపై చట్టబద్ధమైన విచారణ, ప్రొసీడింగ్స్ లేకుండా కేవలం రెవెన్యూ రికార్డుల్లో ఒక ఎంట్రీ ఆధారంగా పట్టాదారు హక్కులు కల్పించలేరని స్పష్టం చేసింది.
ఈ భూమిపై 1995 నుంచి కొనసాగుతున్న న్యాయ వివాదంలో గతంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రత్యేక కోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించింది. బండారి రామచందర్‌తో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు భూమిపై హక్కులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ప్రత్యేక కోర్టు 1997లో తిరస్కరించింది. వారిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. 2003లో హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. నిజాం కాలం నాటి జాగీరు వ్యవహారాలు, వారసత్వ హక్కుల వాదనలు, పాత రెవెన్యూ రికార్డుల్లో నమోదైన పేర్లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. భూమి ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించింది. దీంతో మియాపూర్‌లోని ఈ 550.39 ఎకరాల భూమిపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా తుది తీర్పు వెలువడింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!