

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సహాయక, పునరుద్ధరణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. భీకర గాలులకు రహదారులపై వందలాది చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీలు, కట్టర్ల సాయంతో కేవలం 12 గంటల్లోనే అడ్డంకులను తొలగించి రహదారులను పునరుద్ధరించారు. దీంతో గురువారం ఆర్టీసీ బస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అమలాపురంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. సెల్ సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు జిల్లాలోని సుమారు 300 టవర్లను జనరేటర్ల సాయంతో నిర్వహించి కమ్యూనికేషన్ వ్యవస్థను కొంతమేర అందుబాటులోకి తెచ్చారు.
మరోవైపు విశాఖపట్నంలో జీవీఎంసీ సిబ్బంది తుఫాన్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నగరంలో నేలకొరిగిన 1,192 భారీ వృక్షాల్లో 1,057 చెట్లను తొలగించారు. 45 పొక్లెయిన్లు, టిప్పర్లను వినియోగిస్తూ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారు. రహదారులపై పడిన చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. విపత్తు సమయంలో నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్న జీవీఎంసీ సిబ్బందిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!