

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. గతంలో మేడిగడ్డ వద్ద బ్లాస్టింగ్‌లు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని, తాజాగా మల్లన్నసాగర్ నుంచి మూసీ సుందరీకరణ పనుల కోసం నీటిని తరలించే ఏర్పాట్లలో భాగంగా అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం కుకునూర్‌పల్లి మండలం తిప్పారం గ్రామంలో మల్లన్నసాగర్ కట్ట సమీపంలో రాళ్ల గుట్టలను పేల్చుతున్న ప్రాంతాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ సైట్ ఇంజినీర్‌ను పనుల గురించి ప్రశ్నించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు, గ్రామపంచాయతీ నుంచి అనుమతులు లేకుండానే రెండు మూడు నెలలుగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు.
మూసీ ప్రక్షాళనకు, హైదరాబాద్‌కు నీటిని తరలించే పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే అన్ని పనులూ నిబంధనల ప్రకారం జరగాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బ్లాస్టింగ్‌ల ప్రభావంతో కిలోమీటరు దూరంలోని తిప్పారం గ్రామంలో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, కొన్ని ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. అర్ధరాత్రి భారీగా పేలుళ్లు జరపడం వల్ల మల్లన్నసాగర్ కట్ట దెబ్బతిని, రిజర్వాయర్ నుంచి నీరు లీకవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!