

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన వ్యక్తిగత జీవితం, రెండో వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భోజ్‌పురి బవాల్’ అనే వినోద కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన భవిష్యత్ వివాహంపై సూచనప్రాయంగా మాట్లాడారు. పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఉంటున్నారా అని నిర్వాహకులు ప్రశ్నించగా, తాను ఒంటరిగా లేనని, తన చుట్టూ చాలామంది ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం విడాకుల కేసు కొనసాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తన భాగస్వామి తన వద్దకు వస్తారని పేర్కొన్నారు.
అయితే కాబోయే భాగస్వామి ఎవరు అనే విషయాన్ని వెల్లడించేందుకు తేజ్ ప్రతాప్ నిరాకరించారు. అది తన వ్యక్తిగత విషయమని, టీవీ ఛానల్‌లో చెప్పలేనని స్పష్టం చేశారు. తేజ్ ప్రతాప్ 2018లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతోంది. గతంలో అనుష్క యాదవ్‌తో ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం ఆయన కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!