

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదన అమలులోకి వచ్చినప్పటికీ 11, 12 తరగతుల సిలబస్‌లో అదనపు మార్పులేవీ ఉండవని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే. కేశవరావు అధ్యక్షతన విద్యా సంస్కరణలపై ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గురుకుల సొసైటీల కార్యదర్శులు హాజరయ్యారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా చూడటం, వారి విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొనసాగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని కేశవరావు తెలిపారు. ఇంటర్ బోర్డు, కమిషనరేట్‌లోని బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ నిబంధనలు, ఉద్యోగ ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది.
సిలబస్ మార్పులపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సూచించారు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే 11వ తరగతి సిలబస్ సవరణ పూర్తయిందని, 12వ తరగతి సిలబస్ సవరణ కూడా అదే ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. అదనంగా ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. మరోవైపు, యూడైస్ గణాంకాల ప్రకారం పదో తరగతి నుంచి 11వ తరగతికి మారే సమయంలో 16 శాతానికి పైగా, తొమ్మిదో తరగతి నుంచి 11వ తరగతి మధ్య 25 శాతానికి పైగా విద్యార్థులు చదువు మానేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి వరకు విద్య అందించే పాఠశాలల సంఖ్యకు, జూనియర్ కాలేజీల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, బాలికల విద్యపై దీని ప్రభావం ఉంటోందని అభిప్రాయపడ్డారు. విద్య ఇంజినీరింగ్, మెడికల్ కోచింగ్‌కే పరిమితం కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలని విద్యావేత్తలు సూచించారు. అలాగే, విద్యాసంస్థలకు తొమ్మిది, పది తరగతులకే కాకుండా ఒకటో తరగతి నుంచే అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!