

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మరో భారీ ప్లేయర్ ట్రేడ్ డీల్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) నుంచి రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్)కు మారనున్నట్లు సమాచారం. ఇందుకు బదులుగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రాజస్థాన్ నుంచి లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగియనున్న సమయంలో ఈ వార్త క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే ఈ ట్రేడ్‌పై ఇప్పటివరకు ఇరు జట్ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
షమీ రాకతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. జోఫ్రా ఆర్చర్‌తో కలిసి కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 36 ఏళ్ల షమీ, ఐపీఎల్ 2026లో లక్నో తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఓవర్‌కు 9 పరుగుల ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు సామ్ కరన్ రాకతో లక్నోకు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఉపయోగపడే ఆల్‌రౌండర్ అందుబాటులోకి వస్తాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కరన్, ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. బ్యాటింగ్‌లో వివిధ స్థానాల్లో ఆడటంతో పాటు ఇన్నింగ్స్‌లో కీలక దశల్లో బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి ఉంది. ఈ ట్రేడ్ డీల్‌పై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!