

తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కుటుంబాలకు కీలక వెసులుబాటు కల్పించింది. పింఛను పొందుతున్న భర్త మరణించినప్పుడు ఆయన భార్యకు వెంటనే పింఛను మంజూరు చేసే ప్రత్యేక విధానాన్ని అన్ని కేటగిరీలకు విస్తరించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛను పొందుతున్న పురుష లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో మాత్రమే ఆయన భార్యకు వెంటనే పింఛను మంజూరు చేసే అవకాశం ఉండేది. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధనను ఇతర పింఛను కేటగిరీలకు కూడా వర్తింపజేసింది.
ఈ నిర్ణయంతో దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, హెచ్‌ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. మరణించిన పురుష పింఛనుదారుడి భార్య వయస్సు 57 ఏళ్లలోపు ఉంటే వితంతు పింఛను మంజూరు చేస్తారు. 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే వృద్ధాప్య పింఛను అందిస్తారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!