

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వివిధ జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గౌరవ్ ఉప్పల్ మంత్రికి వివరించారు. సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ పరిధిలో ఇప్పటికే తొమ్మిది ఆసుపత్రుల భవనాలు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి మరో 14, 2027 మార్చి నాటికి ఇంకో 11 భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అదనంగా మరో 45 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.
పూర్తయిన తొమ్మిది ఆసుపత్రుల భవనాల్లో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నీచర్ ఏర్పాటు చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్, మార్చి నాటికి పూర్తయ్యే భవనాలకు అవసరమైన పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలు ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో కనీసం 90 శాతం మంది రోగులకు స్థానికంగానే వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు కీలకమని పేర్కొన్నారు. గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించామని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత డీసీహెచ్‌ఎస్‌లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!