

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొత్త ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్, సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆలయ ఈవో, ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్, సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్‌ఛైర్మన్, ప్రధాన అర్చకుడు తదితర ప్రతివాదులు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
నాగిళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక వంశపారంపర్య ధర్మకర్త భాస్కరయాణి నరసింహమూర్తి దాఖలు చేసిన పిటిషన్లలో దేవాదాయ ధర్మాదాయ చట్ట సవరణలు, ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుకు సంబంధించిన జీవో నం.392ను సవాలు చేశారు. ఆలయాల కోసం ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటు, వంశపారంపర్య ధర్మకర్తకు సాధారణ సభ్యుడిగా స్థానం కల్పించడం రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని వారు వాదించారు. ఆలయాల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రతివాదులను వివరణ సమర్పించాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!