

ఘనా దేశ పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఘనాలో ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఘనా అధ్యక్ష సలహాదారు ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ–ఘనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సహకార అవకాశాలపై చర్చించారు. ఘనా తమ 24-గంటల ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి అభివృద్ధి కార్యక్రమం, ఫార్మా హబ్ ప్రాజెక్ట్‌లను వివరించి తెలంగాణ సహకారం కోరింది.
మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ సాధించిన వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధిని వివరించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, ఆధునిక తయారీ రంగాల్లో తెలంగాణ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాల వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఫార్మాస్యూటికల్ తయారీ, వ్యాక్సిన్ అభివృద్ధి, పరిశోధన, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణలో తెలంగాణ నైపుణ్యాన్ని ఘనాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఘనా అభివృద్ధి ప్రయాణంలో తెలంగాణ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!