

దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులు, హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో డిమాండ్‌కు అనుగుణంగా అదనపు బస్సులను నడపనున్నారు. తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో పెట్టుకుని 25, 26 తేదీల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రయాణికుల కోసం పండళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట రద్దీ తేదీల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల టికెట్ చార్జీలను 1.5 రెట్ల వరకు సవరించారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. ముందస్తు రిజర్వేషన్లను TGSRTC వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చని, మరింత సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!