

దేశ రాజధాని దిల్లీలో మరో భవన ప్రమాదం చోటుచేసుకుంది. ఓల్డ్ దిల్లీలోని చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే భవనం ఉన్న ప్రాంతం ఇరుకైన వీధి కావడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనం లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే అది కూలిపోయి ఉండొచ్చని స్థానికులు వెల్లడించారు.
ఇటీవల దిల్లీలో వరుసగా భవన ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా చాందినీ చౌక్‌లోని దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌హాల్‌లో కొంతభాగం కూలిపోయింది. మరోవైపు, మిలన్ గార్డెన్ ప్రాంతంలో పాత ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా భవనం కూలిన ఘటనలోనూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలతో దేశ రాజధానిలో భవనాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!