

పోలీసు అధికారి సంకిరెడ్డి భీమ్‌రెడ్డి, ఆయన భార్యకు సంబంధించిన బినామీ ఆస్తుల వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. అధికారికంగా చేసిన పనులకు ప్రతిఫలంగా లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు ఇళ్లు, టయోటా ఇన్నోవా క్రిస్టా కారుతో పాటు నాలుగు వ్యవసాయ భూములను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం నవంబరు 3న మూడు ఉత్తర్వులు జారీ చేసింది. పటాన్చెరు పరిధిలోని ముత్తంగిలో ఉన్న రెండు ఇళ్లు, మొగుడంపల్లిలోని 3.20 ఎకరాల వ్యవసాయ భూములు, ఇన్నోవా కారు ఈ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్న విలువల ప్రకారం వీటి మొత్తం విలువ రూ.59.4 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం స్థిరాస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఐటీ శాఖ దర్యాప్తు ప్రకారం.. జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 జులైలో ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న రెండు ఇళ్లను పోతుగంటి ఇంద్రకరణ్‌రెడ్డి పేరుతో ఎలాంటి నగదు తీసుకోకుండా బదిలీ చేసింది. పటాన్చెరు ఎస్డీపీఓగా పనిచేసిన సమయంలో భీమ్‌రెడ్డి చేసిన అధికారిక మేళ్లకు ప్రతిఫలంగా ఈ ఇళ్లు ఇచ్చినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, మొగుడంపల్లిలోని నాలుగు వ్యవసాయ భూములను హోంగార్డు లక్ష్మణ్ నాయక్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయగా, వాటి అసలు లబ్ధిదారుల్లో భీమ్‌రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రమాదాలకు సంబంధించిన వివాదాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా యాపిల్ ఎంటర్ప్రైజెస్ యజమాని ఆలూరి సురేష్ ఇన్నోవా క్రిస్టా కారును అందించినట్లు ఐటీ శాఖ ఆరోపించింది. ఈ వాహనం విలువను రూ.22 లక్షలుగా ఉత్తర్వుల్లో పేర్కొనగా, 2024 చివరి నుంచి భీమ్‌రెడ్డి ఒక్కరే దానిని వినియోగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!