

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కర్ణాటకకు చెందిన వ్యక్తి హత్య కేసు కలకలం రేపుతోంది. ఉడుపి జిల్లా కుందాపురానికి చెందిన ఆల్విన్ ప్రకాశ్ కుందర్ షార్జా విమానాశ్రయంలో సుమారు 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. జులై 20 ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ తెలిపారు. అయితే తనకు ఏమీ కాలేదని చెబుతూ ఫోన్ నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ రావడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. సాధారణంగా ఆల్విన్ వాయిస్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడేవారని, ఇలా టెక్స్ట్ మెసేజ్ పంపడం తమకు అసాధారణంగా అనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో స్నేహితులు, కంపెనీ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించిన అనంతరం ఆయన భారత్‌కు తిరిగి రాలేదని తెలిసి మిస్సింగ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దర్యాప్తు సమయంలో ఒమన్ వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఆల్విన్ మృతదేహం లభించినట్లు ఆయన సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు సంచుల్లో ఉంచినట్లు వెల్లడించారు. మరోవైపు ఆల్విన్ భార్య టీనా కుందర్, వారి టీనేజ్ కుమారుడు కూడా ప్రస్తుతం ఆచూకీ లేకుండా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారి ప్రస్తుత ఆచూకీ, హత్యతో వారికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యకు కారణం, నిందితులు ఎవరనే విషయాలపై యూఏఈ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆల్విన్, టీనా మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసులో సహాయం కోరుతూ ఆల్విన్ సోదరుడు ఉడుపి పోలీసులను కూడా సంప్రదించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!