

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌కు ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రి చేరకుండా అడ్డుకునేందుకు అగ్రరాజ్యం చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇరాన్ ఓడరేవులు, అంతర్జాతీయ జలమార్గాలపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై నిఘా పెంచింది. ఈ క్రమంలో ఇరాన్ భూ సరిహద్దులు, కాస్పియన్ సముద్రం మీదుగా అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు, నిషేధిత సామగ్రిని తరలించకుండా అడ్డుకునేందుకు 20 మంది సభ్యులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఈ విభాగానికి టాస్క్‌ఫోర్స్ ఐరన్ గేట్ అని పేరు పెట్టింది.
ఫ్లోరిడాలోని టాంపా కేంద్రంగా ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేయనుంది. ఇందులో సైనికులతో పాటు పౌరులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఇతర అమెరికా ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఆయుధ వ్యవస్థలు, ద్వంద్వ వినియోగ సాంకేతిక పరిజ్ఞానం, ఆంక్షలకు లోబడి ఉన్న సామగ్రి, అక్రమ ఆర్థిక వనరుల తరలింపును అడ్డుకోవడం ఈ విభాగం ప్రధాన లక్ష్యం. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, ఆయుధ తయారీ కేంద్రాలను పునర్నిర్మించడం, సైనిక సామర్థ్యాలను తిరిగి పెంపొందించుకోవడం వంటి ఇరాన్ ప్రయత్నాలను నియంత్రించడమే లక్ష్యంగా అమెరికా ఈ చర్యలు చేపడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!