

అమెరికాలో హెచ్1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు ప్రతినిధుల సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. H-1B Visa Fraud Crackdown Act (H.R. 10643) పేరుతో అక్టోబర్ 1న ప్రతినిధి బెత్ వాన్ డ్యూన్‌తో పాటు మరో ఐదుగురు రిపబ్లికన్ సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా తొలగించడం వంటి తీవ్రమైన హెచ్1బీ ఉల్లంఘనలకు గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లు (సుమారు రూ.2.4 కోట్లు) జరిమానా, కనీసం 10 ఏళ్ల పాటు హెచ్1బీ స్పాన్సర్‌షిప్ నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ బిల్లు హౌస్ జ్యుడీషియరీ కమిటీ పరిశీలనలో ఉంది; ఇంకా చట్టంగా మారలేదు.
ఇతర ఉద్దేశపూర్వక హెచ్1బీ ఉల్లంఘనలకు గరిష్ఠ జరిమానాను 1 లక్ష డాలర్లకు పెంచడంతో పాటు, స్పాన్సర్‌షిప్ నిషేధ కాలాన్ని కనీసం ఐదేళ్లకు పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇమ్మిగ్రేషన్ సంబంధిత నకిలీ పత్రాల తయారీ, మోసాలపైనా జరిమానాలను పెంచాలని సూచించారు. ఒక్కో పత్రానికి ఉల్లంఘన స్వభావాన్ని బట్టి $1,000 నుంచి $10,000 వరకు, కొన్ని పునరావృత ఉల్లంఘనలకు $50,000 వరకు జరిమానాలు ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రధానంగా హెచ్1బీ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, స్పాన్సర్లపై చర్యలను కఠినతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!