

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడంతో పాటు ఆ దేశ అణు కార్యక్రమంపై వివాదానికి పరిష్కారం చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం సోమవారంతో ముగిసింది. 60 రోజులపాటు సైనిక చర్యలను నిలిపివేయడం, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడం వంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయి. అయితే శాశ్వత శాంతికి మార్గం చూపే తుది ఒప్పందం ఇరుదేశాల మధ్య కుదరలేదు. హర్మూజ్‌పై నియంత్రణ విషయంలోనూ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడలేదు.
ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేసిందని అమెరికా ఆరోపించగా, అమెరికా తన దాడులను తీవ్రతరం చేసింది. అనంతరం ఇరాన్ జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలను పునరుద్ధరించడంతో పాటు ఆ దేశ రేవుల దిగ్బంధనాన్ని కూడా కొనసాగించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది తాముకాదంటూ ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జూన్‌లోనే నిలిచిపోయాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అయితే మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి సందేశాలు వస్తున్నాయని వారు తెలిపారు. పెద్దస్థాయి దాడులు నిలిచిన తర్వాత చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఒప్పందం గడువు ముగిసినా దాన్ని పొడిగించే అవకాశం ఉందని చర్చల్లో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. హర్మూజ్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ చమురు ధరలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!