

అమెరికాకు చెందిన 38 ఏళ్ల డీర్‌డ్రే కీన్ గర్భిణిగా ఉన్న సమయంలో ఏడు మారథాన్లు పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు ఆమె మొత్తం 70 మారథాన్లలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రముఖ మారథాన్లలో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్న కీన్.. ఈ ఏడాది మార్చిలో టోక్యో మారథాన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం బోస్టన్, లండన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన మారథాన్లలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు 25 వారాల గర్భంతో సిడ్నీ మారథాన్‌లో, 29 వారాల గర్భంతో బెర్లిన్ మారథాన్‌లో, 31 వారాల గర్భంతో చికాగో మారథాన్‌లో పరుగెత్తారు. ఈ నెల మొదటి వారంలో 34 వారాల గర్భంతో న్యూయార్క్ మారథాన్‌ను కూడా పూర్తి చేశారు. వృత్తిరీత్యా నర్సుగా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కీన్.. గత ఏడాది బ్రియాన్‌ను వివాహం చేసుకున్నారు.
మారథాన్‌లలో పాల్గొనడానికి తన తండ్రే ప్రధాన స్ఫూర్తి అని కీన్ తెలిపారు. ఐర్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఆయన 1980, 1990 దశకాల్లో పలు మారథాన్లలో పాల్గొనేవారని గుర్తుచేసుకున్నారు. తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించారని, ఆయనకు శస్త్రచికిత్స జరగడానికి ఒక రోజు ముందు కూడా న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. అంతేకాకుండా, 2023లో ఏడు రోజుల్లో ఏడు అంతర్జాతీయ మారథాన్లు పూర్తి చేసే ఛాలెంజ్‌లోనూ కీన్ పాల్గొన్నారు. గర్భధారణ సమయంలో మారథాన్లలో పాల్గొన్న ఆమె ప్రయాణం ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!