

ప్రపంచవ్యాప్తంగా ‘మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్’గా గుర్తింపు పొందిన డచ్ మోడల్ వెరా డిజ్క్‌మాన్స్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా విమానంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం డెలానీ హాల్ నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు వెల్లడించారు. అక్కడి పరిస్థితులు అపరిశుభ్రంగా ఉన్నాయని, నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకే గదిలో మరో 12 మంది ఖైదీలతో కలిసి ఉంటున్నట్లు తెలిపారు. తనను ఎందుకు నిర్బంధించారనే విషయాన్ని అధికారులు స్పష్టంగా వెల్లడించలేదని వెరా కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె టూరిస్ట్ వీసాపై అమెరికాలో ఉన్నట్లు తెలిపారు.
వెరా గ్రీన్‌కార్డ్ దరఖాస్తుకు సంబంధించి ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌కు ఇటీవల హాజరుకాలేదని ఆమె తల్లి వెల్లడించారు. అందువల్లే ఈ నిర్బంధం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అమెరికాలోని డచ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆశించిన సహాయం అందలేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాయబార కార్యాలయ ప్రతినిధి.. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, వెరాకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోప్యతా కారణాల వల్ల మరిన్ని వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు. టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లినవారు అక్కడ ఆదాయం పొందే కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే నిబంధన ఉంది. ఈ నిబంధన ఉల్లంఘన కారణంగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వెరాకు సుమారు 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. గతేడాది ఓ కార్యక్రమంలో తనకు 5,000 మందికి పైగా డేటింగ్ అభ్యర్థనలు వచ్చాయని చెప్పడంతో ఆమె వార్తల్లో నిలిచారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!