

అమెరికా నిఘా సంస్థలకు అందిన సమాచారం ప్రకారం.. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ సాధ్యమైన ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారం అమెరికా ప్రభుత్వ వర్గాల్లో భద్రతాపరమైన ఆందోళనలకు కారణమైంది. అయితే, ఇది తక్షణ దాడికి సంకేతం కాదని, భవిష్యత్తులో అవసరమైతే ఉపయోగించుకునే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తోందని నిఘా వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. ఈ తరహా దాడి చేసే సామర్థ్యం, ఉద్దేశం ఇరాన్‌కు ఉన్నాయా అనే విషయంలో అమెరికా అధికారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో గత వారంలోనే అమెరికా ఉన్నతాధికారులు ముందస్తు భద్రతా చర్యలు, సంభావ్య ముప్పులను ఎదుర్కొనే మార్గాలపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రస్తుతం అన్ని రకాల ముప్పులను పర్యవేక్షిస్తోందని, అయితే దేశ భూభాగానికి ప్రస్తుతం విశ్వసనీయమైన ముప్పు లేదని వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ తెలిపారు. మరోవైపు, రసాయన ఆయుధాల వినియోగానికి సంబంధించిన ఆరోపణలను ఇరాన్ ఐక్యరాజ్యసమితి దౌత్య కార్యాలయం ఖండించింది. ఈ సమాచారం ఇంకా పరిశీలనలోనే ఉందని, తక్షణ దాడి జరిగినట్లు ఎలాంటి నిర్ధారణ లేదని స్పష్టమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!