

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్‌ను తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’ వసూళ్ల లక్ష్యంపై సినీ, ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
‘జైలర్’ తొలి భాగం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని, దాదాపు రూ.45–50 కోట్ల షేర్ వచ్చినట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. తొలి భాగం తెలుగు హక్కుల వ్యాపారం సుమారు రూ.12–15 కోట్ల మధ్య జరిగినట్లు సమాచారం. అయితే ‘జైలర్ 2’ హక్కుల కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ.45 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో గత చిత్రం సాధించిన వసూళ్లే సీక్వెల్‌కు కొత్త బెంచ్‌మార్క్‌గా మారాయనే ప్రచారం సాగుతోంది. ఈ గణాంకాలపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!